– నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ఎవరు?
– అన్నదాతల చావులకు కారకులెవరు?
– మీకు దేవుడైతే ఇంట్లో భజనలు చేసుకోండి?
– అమరవీరుల త్యాగాలను కించపరచొద్దు?
– తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదు!
– సకలజనుల కష్టఫలితం.. ప్రత్యేక రాష్ట్రం..
– జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రజలు గరం గరం
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డేని టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల పేరుతో రాష్ట్రమంతా హడావుడి చేశారు. అయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఉసరవెల్లి ట్వీట్ బాగా వైరల్ అయింది. కేసీఆర్ పేరు మెన్షన్ చేయకుండా హ్యాపీ బర్త్ డే అని ఉసరవెల్లి ఫోటోను పోస్ట్ చేశారు రేవంత్. దీనిపై టీఆర్ఎస్ వర్గాల నుంచి స్ట్రాంగ్ కౌంటర్సే వచ్చాయి. తరచూ పార్టీలు మార్చే రేవంత్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు.
రేవంత్ పై విరుచుకుపడుతూ ఇంకా చాలా విమర్శలే చేశారు జీవన్ రెడ్డి. కానీ.. ఆయన అన్న ఓ మాట తెలంగాణ ప్రజలను షాక్ కు గురిచేసింది. కేసీఆర్ బర్త్ డేను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ మాకు దేవుడు, ఆయన బర్త్ డే పవిత్రమైన దినం.. రంజాన్, దసరా, క్రిస్మస్ ఎట్లనో తెలంగాణకు సీఎం పుట్టిన రోజు కూడా అంతే. తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తి’ అని అన్నారు జీవన్ రెడ్డి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. కేసీఆర్ పై మీకు అంత స్వామిభక్తి ఉంటే ఇంట్లో ఫోటో పెట్టుకుని భజన కార్యక్రమాలు చేసుకోండి.. అంతేగానీ దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలతో బర్త్ డేను లింక్ పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. పైగా కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. ఉద్యమాన్ని కించపరిచినన వారిని పక్కనపెట్టుకుని కేసీఆర్ పాలన సాగించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇటు నిరుద్యోగులు, రైతులు అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు గానీ.. సీఎం బర్త్ డేని పండుగగా ప్రకటించాలా? అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబానికి భారమై తనువు చాలిస్తున్న నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏనాడైనా పట్టించుకున్నారా? అంటూ నిలదీస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైనందుకు ఆయన బర్త్ డేని పండుగలా చేసుకోవాలా? అని మండిపడుతున్నారు. అలాగే రైతులు కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా.. వర్షానికి తడిసి మొలకలు వచ్చేలా చేసినందుకు.. ఎందరో అన్నదాతల చావులకు కారణం అయినందుకు కేసీఆర్ బర్త్ డేని పండుగగా ప్రకటించాలా? అంటూ ఫైరవుతున్నారు.