గవర్నర్ వద్ద పెండింగ్‌లో వున్న బిల్లులపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ సర్కార్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం పేర్కొంది.
చాలా రోజులుగా బిల్లులు ఆమోదానికి నోచుకోకుండా గవర్నర్ వద్ద పెండింగ్ లో వున్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో మరో మార్గం లేకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అయితే దీనిపై ఈ నెల 24 న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.
కానీ దీనిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని దవే కోరారు. ఈ క్రమంలో ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు విచారణను సోమవారం నుంచే చేపట్టనున్నట్టు వెల్లడించింది. బిల్లులను పరిశీలించే నెపంతో బిల్లులన్నింటినీ గవర్నర్ తన వద్ద పెండింగ్ లో పెట్టారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో వుండిపోయిందన్నారు. ఆయా బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినా గవర్నర్ నుంచి అనుమతులు రాకపోవడంతో అమలుకు వీలు పడడంలేదని పిటిషన్ లో సీఎస్ శాంతా కుమారి వెల్లడించారు.