పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా చేపట్టే ఈవెంట్స్ నిర్వహణపై రిక్రూట్ మెంట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణపై ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ)లు డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించేందుకు 11 కేంద్రాలను ఎంపిక చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మొత్తం ఈవెంట్స్ ప్రక్రియను 23 – 25 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. జనవరి తొలి వారం వరకు పూర్తి చేస్తామని తెలిపింది.
అభ్యర్థులు ఈనెల 29 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 3 వ తేదీ అర్ధరాత్రి వరకు వీటిని పొందవచ్చని అధికారులు వెల్లడించారు. www.tslprb.in ద్వారా వీటిని పొందవచ్చని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే… support@tslprb.in అడ్రస్ కు మెయిల్ చేయవచ్చని వివరించారు. లేకపోతే ఈ ఫోన్ నెంబర్లను (93937 11110 or 93910 05006) సంప్రదించవచ్చు.