వీక్షణంపై ఎందుకంత కక్ష? - Tolivelugu

వీక్షణంపై ఎందుకంత కక్ష?

వీక్షణం సంపాదకుడిపై అక్రమ కేసును ఉపసంహరించాలి! భిన్నస్వరాలపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఖండించండి!!

‘వీక్షణం’ రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ (యుఎపిఎ), తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ సెక్షన్ల కింద అక్రమకేసు బనాయించారు. ఈ చర్య రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రకటనా స్వాతంత్ర్యానికి అనుగుణంగా, ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు ఒక పత్రికా సంపాదకుడిపై పాలకుల కక్ష సాధింపుకు నిదర్శనమే.
నవంబర్ 12న హైదరాబాదులో అరెస్టు చేసిన ఎన్ రవి శర్మ, బి అనూరాధల కేసులో హఠాత్తుగా ఎన్ వేణుగోపాల్ పేరు నిందితుడిగా చేర్చి పోలీసులు ఆయనను వేధించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ చర్య కక్ష సాధింపు మాత్రమే కాక, పచ్చి అబద్ధాలతో కూడిన హాస్యాస్పదమైన ప్రయత్నంగా ఉంది. ఎల్ బి నగర్ రెండవ మెట్రోపాలిటన్ మెజస్ట్రేట్ దగ్గర నవంబర్ 13న సమర్పించిన రిమాండ్ కేస్ డైరీలో ఆయనను ఏడవ ముద్దాయిగా (ఎ7) చూపి, పక్కన “విరసం విప్లవ రచయితల సంఘం సభ్యుడు” అని, “పరారీలో ఉన్నాడు” అనీ రాశారు. 2009లో వేణుగోపాల్ రాసిన ఒక వ్యాసం మీద వివాదంతో ఆయన విప్లవ రచయితల సంఘం నుంచి దూరం అయ్యాడని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడుగా లేడు. పూర్తికాలం వీక్షణం నిర్వాహకుడిగా ఉన్నాడు. గత పది సంవత్సరాలుగా ఆయన జీవితం చూసిన ఎవరికైనా ఇవి తెలుసు. ప్రగతిశీల, ప్రజాస్వామిక, వామపక్ష భావాలున్నంతమాత్రాన ఒక సంస్థలో సభ్యుడుగా ఉండనక్కరలేదు. అంతకు ముందు విరసం సభ్యుడు గనుక ఎవరైనా ఆ పాత గుర్తింపుతోనే వ్యవహరించినా ఆయన ఎన్నో వేదికల మీద దాన్ని సవరించాడు. తాను ఏ సంస్థలోనూ సభ్యుడిని కాదని చెప్పుకున్నాడు. అయినా ఆయన మీద ఆ నిందాముద్ర వేయడానికి, స్వతంత్ర పాత్రికేయుడిగా ఆయన ప్రతిష్ఠను దిగజార్చడానికి పోలీసులు దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇది.
తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలలో పదిహేను సంవత్సరాలు పనిచేసి, పదిహేడు సంవత్సరాలుగా స్వతంత్ర మాసపత్రిక సంపాదకుడిగా ఉన్న ఎన్ వేణుగోపాల్ పాత్రికేయ కృషి గురించి తెలుగు పాఠకులకు, ప్రజలకు కొత్తగా చెప్పనక్కరలేదు. రచయితగా, వక్తగా సుప్రసిద్ధుడైన వేణుగోపాల్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ భావజాలం కలిగి ఉన్నాడని కూడ అందరికీ తెలుసు. గత ముప్పై సంవత్సరాలలో ఆయన ప్రచురించిన ఇరవై ఐదు పుస్తకాలు, అనువదించిన ఇరవై ఐదు పుస్తకాలు, రాసిన వందలాది వ్యాసాలు, చేసిన వందలాది ఉపన్యాసాలు తెలుగు సమాజానికి తెలిసినవే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఎంతో మందితో కలిసి వేదికల మీద మాట్లాడి, జిఓ 610 మీద తెలంగాణ ఎన్జీవోల సంఘం నిర్వహించిన సభల్లో రాష్ట్రమంతటా ఉపన్యసించి ఆయన నిర్వహించిన పాత్ర కూడ అందరికీ తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రజా ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని గత ఐదు సంవత్సరాలుగా ఆయన రచిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. ఇలా బహిరంగ ప్రజాజీవితంలో, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్న వాక్సభాస్వాతంత్ర్యాలతో తన అభిప్రాయాలు ప్రకటిస్తున్నందుకు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తున్నందుకు ఆయన మీద పాలకులకు కన్నెర్రగా ఉందని కూడ చాల మందికి తెలుసు.
అలాగే, రాష్ట్రప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డు ఉన్న పత్రికా రచయితగా, ప్రతిరోజూ ఏదో ఒక వేదిక మీద ఉపన్యసిస్తూ, ఒక ప్రముఖ దినపత్రికలో శీర్షిక రాస్తూ, ఒక మాసపత్రిక నడుపుతూ బహిరంగ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని పరారీలో ఉన్నాడు అని అబద్ధం చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడం పోలీసుల కుట్ర వైఖరిని బైటపెడుతున్నది. ఆయన పరారీలో లేడని సమాజానికి తెలుసు. రిమాండ్ కేస్ డైరీ మొదటి పేజీలో అలా ఆయన పేరు రాసి, పక్కన రెండు అబద్ధాలు చేర్చిన పోలీసులు, ఆ వెనుక ఉన్న పన్నెండు పేజీల్లో ఆయన పేరు కూడ ప్రస్తావించలేదు. ఆయన ఏ నేరం ఎప్పుడు, ఎక్కడ చేశాడో మాట మాత్రం కూడ లేదు. అంటే ఈ పేరు చేర్పు కేవలం ఆయన మీద కక్ష సాధించడానికి, తద్వారా ఆయన సంపాదకుడుగా ఉన్న వీక్షణం ను బెదిరించడానికి జరుగుతున్న దుష్ప్రయత్నం మాత్రమే.
ఇటు నవ తెలంగాణ దినపత్రికలో ‘తెలంగాణార్థం’ శీర్షికలో, అటు ‘వీక్షణం’ మాసపత్రికలో సంపాదకీయాల్లో, అచ్చువేస్తున్న వ్యాసాల్లో, రాష్ట్రంలో అనేక చోట్ల అనేక వేదికల మీద ఉపన్యాసాలలో, యూట్యూబ్ చానళ్లలో ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల మీద తన విమర్శ సాగిస్తున్నాడు. అందువల్ల ఆయన స్వరం మూసివేసేందుకు, భిన్న స్వరాలు వినబడకుండా చేసేందుకు ప్రభుత్వం, పాలకులు, పోలీసులు చేస్తున్న కుట్రగా మాత్రమే ఈ చర్యను చూడవలసి ఉంటుంది. వి హనుమంతరావు సంపాదకుడుగా, ఎబికె ప్రసాద్ గౌరవ సంపాదకుడుగా 2003లో మొదలై, 2005 నుంచి ఎన్ వేణుగోపాల్ నిర్వహణలో నడుస్తున్న వీక్షణం ఈ పదిహేడు సంవత్సరాలుగా అనేక భిన్న స్వరాలకు వేదికగా నిలిచింది. ప్రజల తరఫున ప్రభుత్వ విధానాలను నిశిత పరీక్షలకు గురిచేసింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం భిన్న స్వరాలన్నిటి పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో వీక్షణంను ఇబ్బందుల పాలు చేసేందుకే సంపాదకుడిపై ఈ అబద్ధపు కేసు బనాయిస్తున్నది.
వీక్షణం సంపాదకుడిపై పెట్టిన ఈ అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవలసిందిగా, భిన్నాభిప్రాయం ప్రకటించే పాత్రికేయులపై, మేధావులపై కక్షసాధింపు చర్యలు మానుకోవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

– వీక్షణం కలెక్టివ్ తరఫున

Share on facebook
Share on twitter
Share on whatsapp