టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కోడిపందాల్లో పాల్గొన్నారని పక్కాగా చెబుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. తనకెలాంటి సంబంధం లేదని చింతమనేని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు బయటపెట్టిన వీడియో ఆయనకు పెద్ద షాకిచ్చినట్లయింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. వీటికి బెట్టింగులు లక్షల్లో ఉండగా, పాల్గొన్నవారిలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు ప్రచారం సాగింది. శివారులోని పెద్దకంజర్ల గ్రామంలో కోడిపందాల సమాచారం తెలిసి పోలీసులు రెయిడ్ నిర్వహించగా, నిర్వాహకులు పదెంరాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ నేపథ్యంలో కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపించడం రాక్షస రాజకీయ అవసరంగా కనిపిస్తోందన్నారు చింతమనేని ప్రభాకర్. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైనా ఆపాలని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే.. కోడి పందాల స్థావరం నుంచి చింతమనేని పారిపోతున్నట్లు రికార్డయిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చింతమనేని పారిపోతున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది.