తెలంగాణలో రోజురోజుకీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. పాత రికార్డులను చెరిపేసి.. నమోదవుతున్న కొత్త రికార్డులు చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థం అవుతోంది. గురువారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. ఉదయం 11 గంటలకు గరిష్టంగా 15,497 మెగావాట్ల డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం.
ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడం వల్లే విద్యుత్ డిమాండ్ ఎక్కువైందని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇప్పటిదాకా మార్చి 14న నమోదైన 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగంపై రికార్డ్ ఉండగా.. ఇప్పుడు అది చెరిగిపోయింది. గురువారం 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్టు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. విద్యుత్ వాడకంలో దక్షిణాదిన తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
వేసవి కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం 16వేల మెగా వాట్లకు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎంత డిమాండ్ వచ్చినా కూడా అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు చెబుతున్నారు.