సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం అని బీజేపీ, సమైక్యతా దినోత్సవం అని టీఆర్ఎస్, వీలీన దినోత్సవం అంటూ కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, తెలంగాణ మేధావులు విమోచన దినోత్సవానికే జై కొట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా 75 మంది మేధావులు ప్రధాని మోడీకి లేఖ రాశారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మేధావులు. నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించడంపై మేధావులు మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
నిజాం రాక్షస, అరాచక పరిపాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 75 మంది మేధావులు, ప్రొఫెసర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాదిపాటు విమోచన వజ్రోత్సవాలను(75 ఏళ్లు) కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం హైదరాబాద్ అమరవీరులను సరైన గౌరవాన్ని కల్పించడమేనని పేర్కొన్నారు.
విమోచన దినోత్సవాన్ని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని లేఖలో ప్రధానిని కోరారు. ఇక కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, అధికారులకు కూడా వీరు ధన్యవాదాలు తెలిపారు.