తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం చేసిన అప్పులపై కీలక వివరాలను బయట పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,816 కోట్లు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలే రూ. 1.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ. 75,577 కోట్లుగా ఉన్న అప్పు 2022 అక్టోబర్ నాటికి రూ. 4.33 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు.
కాగా తెలంగాణ సర్కార్ ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే పరిస్థితులు తీసుకొస్తోందని బీజేపీ, కాంగ్రెస్ లు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని.. నేడు అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో చేర్చారని విపక్ష నేతలు బీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. తెచ్చిన అప్పులను కూడా సరైన రీతిలో వినియోగించడం లేదని.. యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యపడుతున్నారు.