గట్లు తెగాయి.. వాగులు, వంకలు ఉప్పొంగాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. రహదారులు దెబ్బతిన్నాయి.. గులాబ్ ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కలెక్టరేట్ జలదిగ్బంధంలో ఉంది. కార్యాలయం చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువులా మారింది. చివరకు కలెక్టర్, అధికారులను ట్రాక్టర్ సాయంతో బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల, కరీంనగర్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద చెరువు పొంగడంతో సిరిసిల్లలోని అంబికానగర్, అశోక్ నగర్, అంబేద్కర్ నగర్, సంజీవయ్య నగర్, శాంతి నగర్ సహా పలు ప్రాంతాల్లోని ఇళ్లలోపలకి వరదనీరు చేరింది.
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి. ఆర్మూర్ రోడ్డులో కంఠేశ్వర్ రైల్వే కమాన్, హైదరాబాద్ రోడ్డుపై నీళ్లు చేరాయి. చాలాచోట్ల వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలంలో కప్పల వాగు ఉద్ధృతికి పెద్ద వాల్గోట్ లోని వైకుంఠ ధామం నేలకూలింది. నిజామాబాద్ శివారులోని ఖానాపూర్ రహదారిపై వాగులో స్కూటీతో పాటు పడిపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. నిజామాబాద్, బోధన్ రోడ్డు నీట మునిగింది.
కామారెడ్డిలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. శివారులో ముత్తకుంట వద్ద లోలెవల్ వంతెనపై లారీ చిక్కుకుపోవడంతో ట్రాక్టర్ సాయంతో బయటకు లాగారు. లింగాపూర్ చెరువు ఉప్పొంగడంతో ప్రవాహంలో ఓ వ్యక్తి బైక్ తోపాటు కొట్టుకుపోయాడు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోని వాగు ప్రవాహంలో ఓ వాహనం చిక్కుకోగా ట్రాక్టర్ సాయంతో దాన్ని బయటకు తీశారు. మాచారెడ్డి మండలం పరిధ్ పేట చెరువు మత్తడిలో చిక్కుకుపోయిన ఆటోను, ప్రయాణికులను స్థానికులు క్షేమంగా బయటపడేశారు.
మెదక్ లోనూ భారీ వర్షాలకు పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. బృందావన్ కాలనీ అయితే చెరువును తలపిస్తోంది. హల్దీవాగు రాయిన్ పల్లి ప్రాజెక్టు, పోచారం డ్యామ్ గ్రామాల్లోని చెరువులు పొంగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా… వర్షం ధాటికి ప్రాజెక్టులు ఫుల్ అవుతున్నాయి. జలాశయాల్లో నీటికి బయటకు వదులుతుండడంతో సమీప ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. జిల్లాల్లో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గాక అధికారులు పంట నష్టంపై అంచనా వేసే అవకాశం ఉంది.