బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై తెలంగాణ రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించి భారతదేశ కీర్తిని తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి శుభాకాంక్షలు, గేయ రచయిత చంద్రబోస్‌కు, స్వరకల్పన చేసిన కీరవాణికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మేము తీయగలమని RRR సినిమా చాటి చెప్పిందని వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే RRR సినిమా విడుదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కొందరు బీజేపీ నేతలు దీనిపై నానా యాగి చేసి, విద్వేషాలు రెచ్చగొట్టారు అని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లను తగలబెడతామంటూ స్వయంగా బండి సంజయ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆనాడు బీజేపీ నేతలు చేసిన మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా..? భారతదేశం పేరు, తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మారుమోగేదా? బీజేపీ వాళ్లు ప్రస్తుతం అవార్డు రాగానే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. బెదిరించేది వాళ్లే.. అవార్డు రాగానే సంబరాలు చేసే ద్వంద నీతి బీజేపీది అని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఇంత అద్భుతమైన సినిమాని కనీసం ఆస్కార్‌కి నామినేట్ చేయాలని సోయి కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు లేకుండా పోయింది అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా విషయంలోనూ బీజేపీ తన గుజరాత్ ఫార్ములాని, స్వార్థపూరిత బుద్ధిని చూపెట్టుకుంది. గుజరాతీ సినిమా “ఛెల్లో షో”ను ఆస్కార్ కి నామినేట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ స్వయంగా ఆస్కార్ కి అప్లికేషన్ పెట్టుకుని పోటీలో పాల్గొన్నది. అదే భారత ప్రభుత్వం నామినేట్ చేసి ఉంటే ఇంకా చాలా గౌరవప్రదంగా ఉండేది. తెలుగుజాతికి, తెలుగు సినిమాకి మరింత గౌరవం వచ్చి ఉండేది. కానీ సినిమా అవార్డుల విషయంలోనూ బీజేపీ స్వార్థపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించింది. ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు వై సతీష్ రెడ్డి.