తెలంగాణలో కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలను వణికిస్తుంది. రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ తో పోటీగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రజలు చూపిస్తున్న కాస్త నిర్లక్ష్యం… వందల కేసులకు కారణం అవుతుంది. లక్షణాలు లేకుండా కరోనా సోకుతుండటం, లక్షణాలను సీరియస్ గా తీసుకోకపోవటం కూడా గ్రామాల్లో కేసుల సంఖ్య పెరగటానికి కారణం అవుతుందని అధికారులంటున్నారు.
తాజాగా ములుగు జిల్లాలో ఊరు ఊరంతా కరోనా బారిన పడటం సంచలనంగా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ప్రజలందరికీ దాదాపు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రతి ఇంట్లోనూ కరోనా కేసులున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన దినకర్మ సహపంక్తి భోజనాల్లో గ్రామంలో చాలా మంది పాల్గొన్నారు. ఈ సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గ్రామ పంచాయతీలో 500 జనాభా ఉంటే 100కి పైగా కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
గ్రామంలో మిగిలిన వారితో పాటు పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను టెస్ట్ చేస్తే కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు. కేసులతో ఆ ఊరు ఊరంతా ఇంటికే పరిమితం అయ్యింది. గ్రామాన్ని పోలీసులు, వైద్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే గత 24గంటల్లో ములుగు జిల్లాల్లో కేవలం 18కేసులే నమోదైనట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.