తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగానే కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న 21 వేల 118 టెస్టులు నిర్వహించగా.. 2 వేల 12 కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 70 వేల 958కి చేరింది. నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 576కు పెరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో 50 వేల 814 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 19 వేల 568 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ ప్రకారం.. నిన్న GHMC పరిధిలో అత్యధికంగా 532 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 198, రంగారెడ్డి- 188, వరంగల్ అర్బన్ -127, ఖమ్మం- 97, సంగారెడ్డి- 89, నిజామాబాద్- 83, నల్గొండ -49, పెద్దపల్లి జిల్లా -41, మహబూబ్‌నగర్ -51, గద్వాల్ -48, భూపాలపల్లి -46, కొత్తగూడెం -52, కరీంనగర్- 41, కామారెడ్డి జిల్లాలో 75 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో టెస్టుల సంఖ్యను బట్టే పాజిటివ్ కేసులు కూడా బయటపడుతున్నాయి. 9 వేల టెస్టులు చేస్తే 900.., 10 వేల శాంపిళ్లను పరీక్షిస్తే 1000.., ఒకవేళ 20 వేలకు పైగా టెస్టులు చేస్తే 2 వేలకు అటు ఇటుగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంటే టెస్టుల సంఖ్యలో 10 శాతం బాధితులు ఉంటున్నారు. ఒక వేళ ఒకే రోజు 50 వేల టెస్టులు చేస్తే.. పాజిటివ్ కేసులు సంఖ్య 5 వేలకు అటు ఇటుగా బయటపడే అవకాశాలున్నాయి..