తెలంగాణలో కరోనా మళ్లీ తన కోరలు చాస్తోంది. మరోసారి తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే మూడు వేవ్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్ భయం వెంటాడేలా చేస్తున్నాయి.
కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 219 మందికి పాజిటివ్ గా నమోదు అయ్యింది. 76 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 164 ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇటు మిగతా రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో విపరీతంగా వ్యాపిస్తోంది. రోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకొన్ని రోజుల్లో అవి వేలల్లోకి మారతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.