దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత తగ్గింది. చాలా రోజుల తర్వాత మళ్లీ 30 వేలలోపే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26 వేల 567 మందికి పాజిటివ్ అని తేలింది. వీటితో కలిపి మొత్తం కేసులు 97 లక్షలు దాటాయి. మరోవైపు కరోనా కారణంగా నిన్న 385 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు లక్షా 40 వేల 958కి చేరాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 91.78 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3.83 లక్షల మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఇక తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. టెస్టులు పెరగడంతో మరి కొంత మంది బాధితులు బయటపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 55 వేల 645 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 682 మందికి పాజిటివ్ అని తేలింది. నిన్న మరో ముగ్గురు కరోనా కారణంగా చనిపోయారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల 74 వేల 540 కేసులు నమోదయ్యాయి. 1477 మంది కరోనాతో మరణించారు. 2 లక్షల 65 వేల 367 మంది కోలుకున్నారు. 7,696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 58.68 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.