ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తుంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థినులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు.. ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
ఉదయం గమ్యస్థానానికి తీసుకెళ్లడం.. సాయంత్రం తిరిగి వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది. ఉమెన్స్ కాలేజీల్లో సొంతంగా ఏర్పాటు చేస్తున్న బస్సుల్లో అధిక ఫీజులు ఉన్నందున కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి వారి కోసమే 50 మందికో బస్సు ఉండే సౌకర్యం కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
దీంతో టీఎస్ఆర్టీసీకి స్థిరమైన ఆదాయం సమకూరడంతో పాటు సురక్షితమైన ప్రయాణం అందించడానికి వీలవుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ప్రత్యేకంగా బస్సులో విద్యార్థినులే ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతీ విద్యార్థికి ఏడాదికి సుమారు రూ.20 వేలకు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తోంది.
వచ్చే విద్యా సంవత్సరం 2023-24కి 500 బస్సులను టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ సిద్ధం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలతో సంప్రదించి.. ప్రత్యేక బస్సులు నగరంలో అన్ని ప్రదేశాల నుంచి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. స్టూడెంట్స్ ను వారి ప్రదేశాల్లో వదిలేసిన తర్వాత అదే మార్గంలో ఇతర ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టీఎస్ఆర్టీసీ.