తెలంగాణ ఆర్టీసీలోని కార్మికులందరిని ఇకపై ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో జారి చేసిన నేపధ్యంలో ఆర్టీసీ యూనియన్ నేతలంతా అత్యవసరంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ని చంద్ర గార్డెన్ లో భేటీ అనంతరం నేతలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలిసింది. 52 రోజుల సమ్మె అనంతరం కార్మికులను విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్..డిపోకు ఇద్దరు ముగ్గురు చొప్పున కార్మికులను పిలిచి వారితో చర్చించారు. ఆర్టీసీ యూనియన్ల నేతల వల్లనే కార్మికులు ఆగమయ్యారన్నారు. కార్మికులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా ఇకపై కార్మికులను కూడా ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పారు. ఆ మేరకు ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ను కూడా విడుదల చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండొద్దని కక్ష గట్టిన ముఖ్యమంత్రి ఆ మేరకు చర్యలు కూడా తీసుకున్నారు. దీంతో అయోమయంలో పడ్డ కార్మిక నేతలు పరిస్థితిని సమీక్షించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.