తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2023-2024)కు గాను వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది ఉన్నత విద్యామండలి. ఎంసెట్, ఐసెట్,ఎడ్ సెట్, లాసెట్,పీజీ ఈసెట్ తదితర ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించింది.
ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లా సెట్, పీజీ ఈ సెట్ ప్రవేశ పరీక్షలను మే నెల మొదటి వారం నుంచి మొదలుకొని చివరి వారం వరకు వరుసగా తెలంగాణ సర్కార్ నిర్వహించనుంది. మే 7వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి.
అదే విధంగా మే 18 న ఎడ్ సెట్ పరీక్షను తెలంగాణ సర్కార్ నిర్వహించనుంది. మే 20 న ఈ సెట్ పరీక్ష, మే 25న పీజీ లా సెట్, పీజీ ఎల్ సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇక మే 26,27 తేదీల్లో టిఎస్ ఐసెట్ పరీక్ష జరగనుంది. మే 29 నుంచి జూన్ ఒకటి వరకు టిఎస్ పీజీ ఈ సెట్ పరీక్ష ఉంటుంది. అయితే ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగేలా ఆమె అధికారులను ఆదేశించారు.