యాంటీబాడీస్ కు సంబంధించి తెలంగాణలో ఓ సీక్రెట్ సర్వే జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ జరిపిన ఈ సర్వేలో పలు విషయాలు బయటకొచ్చాయి. అర్బన్ ప్రాంతాల్లో 80 శాతం మందికి కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందాయని.. అదే రూరల్ ఏరియాల్లో అయితే 60 శాతం మందికి ఉన్నట్లు తేలింది.
వ్యాక్సినేషన్ వల్లే యాంటీబాడీస్ పెరిగినట్లు తెలుసుకున్నారు అధికారులు. దాదాపు 50 శాతం మందికి టీకాల ద్వారా పెరగగా.. మరో 25 శాతం మంది వైరస్ బారిన పడి కోలుకున్నవారని గుర్తించారు. ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో వైద్యాధికారులు ఈ వివరాలను పొందుపరిచారు. గతంలో ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ చేసిన అధ్యయనంలో 64 శాతం మందిలోనే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి. కానీ.. ఈసారి 80 మందికి వృద్ధి చెందాయి.
మరోవైపు రాష్ట్రంలో ఇంకోసారి సీరో సర్వే నిర్వహించాలని చూస్తోంది ప్రభుత్వం. దీనికోసం ఎన్ఐఎన్ తో చర్చలు జరుపుతోంది. త్వరలోనే సర్వే తేదీలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. రాష్ర్టంలో ఇప్పటిదాకా నాలుగు సార్లు సీరో సర్వేలు జరిగాయి.