తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వనం అందినట్టు బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. ప్రారంభోత్సవానికి రావాలని తనను కేసీఆర్ ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. కానీ తన బిజీ షెడ్యూల్ నేపథ్యంలో రాలేనని కేసీఆర్‌కు చెప్పానని వెల్లడించారు.
పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని కేసీఆర్ కోరారని చెప్పారు. కార్యక్రమానికి వెళ్లాలని లలన్ కు చెప్పానన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వికి కూడా ఈ విషయం చెప్పండని కేసీఆర్ తనను అడిగారన్నారు. తాను వారికి చెపుతానని, మీరు కూడా వారికి ఓ మాట చెప్పండని సూచించనన్నారు.
హైదరాబాద్లో కేసీఆర్ సభకు వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీతో తమ భాగస్వామ్యానికి ఎలాంటి నష్టమూ వాటిల్లదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిపి విపక్షాలను ఏకం చేయాలన్న తన ప్రయత్నాలు విరమించలేదన్నారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానన్నారు.
ఆ ఆలోచనలను తాను పక్కన పెట్టలేదన్నారు. వీలైనంత మందిని కలుపుకుని కూటమిగా ముందుకు వెళ్లాలని తాను యోచిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పూర్తవ్వాలని తాను ఎదురు చూస్తున్నానన్నారు. ఆ తర్వాత అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటామన్నారు.
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు పార్టీలతో చర్చలు జరిపి విపక్షాల ఐక్యత విషయంలో తన వంతు ప్రయత్నాలు చేశానన్నారు. ఇది ఇలా వుంటే విపక్ష నేతలతో కలిసి ఇదివరకే కేసీఆర్ ఓ భారీ సభ నిర్వహించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం, కమ్యూనిస్టు నేతలు హాజరయ్యారు. తాజాగా ఆయన మరో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.