తెలంగాణ రాష్ట్ర ఖాతాలో మరో రెండు కేంద్ర పురస్కారాలు వచ్చి చేరాయి. తాజాగా గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలో నూటికి నూరుశాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది.
తాజా పురస్కారాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి పనుల వల్లనే గ్రామీణ ప్రాంతాలు నూరు శాతం అభివృద్ధిని సాధిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పురస్కారాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిజమైన పని దానంతట అదే మాట్లాడుతుందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం, ఆయన మదిలో నుంచి వచ్చిన పల్లెప్రగతి ద్వారానే దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వే ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో ఓడీఎఫ్ ప్లస్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులను ప్రకటించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యాలను సాధించినట్లు అధికారులు తెలిపారు.