తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం వరకు వైద్యారోగ్యశాఖ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగా శనివారం పోలీసు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులకు వ్యాక్సిన్ ఇవ్వటం మొదలుపెట్టారు.
ఈ శాఖల నుండి సుమారుగా 2లక్షల మంది తమకు వ్యాక్సిన్ కావాలని పేరు నమోదు చేసుకున్నారు. దీంతో వీరందరికి ఈనెల 12లోపు వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వటం పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. శనివారం ఎక్కువగా పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
నిజానికి వైద్యారోగ్య సిబ్బంది 3.3లక్షల మంది తమకు వ్యాక్సిన్ కావాలని కోవిన్ సాఫ్ట్ వేర్ లో పేరు నమోదు చేసుకున్నారు. కానీ వ్యాక్సిన్ తీసుకునేందుకు మాత్రం కేవలం 1,93,485మంది మాత్రమే వచ్చారు. దీంతో మిగిలిన వారికి ఇప్పట్లో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం లేదు. తమ వంతు వచ్చినప్పుడు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని… లేదంటే ఇప్పట్లో మళ్లీ అవకాశం రాదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు మరణించారని, వారి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ప్రకటించారు.
ఈనెల 12 తర్వాత 50ఏళ్ల పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పైగా ఇక నుండి ఒక్క ఆదివారం మినహా ప్రతిరోజు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.