కరోనా వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ కొవిడ్ మహమ్మారి అదుపులోకి వచ్చిన సమయంలో మళ్లీ మంకీ పాక్స్ వైరస్ వస్తోందన్న వార్త జనంలో భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తి చెందిన ఈ వైరస్ ముప్పు భారత్‌కూ పొంచి ఉంది.
ఇతర దేశాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌కూ వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రసర్కార్ అప్రమత్తమైంది. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది.
ఎవరికైనా శరీరంపైన పుండ్లు, దద్దుర్లు వంటివి ఏర్పడితే వెంటనే వైద్య, ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలని సర్కార్ సూచించింది. అలాంటి వారు వెంటనే క్వారంటైన్ కావాలని తెలిపింది.
ఇతర దేశాల నుంచి వచ్చిన వారిపైన నిఘా పెట్టాలని జిల్లా వైద్యాధికారులకూ ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ విషయమై ఇప్పటికే అప్రమత్తమై తగు చర్యలకు ఆదేశాలిచ్చాయి. తాజాగా తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది.