ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు వినూత్న నిరసన చేశారు. ఈ మేరకు దున్న పోతుకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని చెబుతూ ఓయూ హబ్సిగూడలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల పరిష్కార పోరాట సమితి కమిటీ సభ్యుల దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ ఈవెంట్స్‌లో 1600 మీటర్లు, 800 మీటర్లు క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ తుది పరీక్షకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో 7 మార్కులు కలపాలన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాసరావును వెంటనే పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో జనవరి 9న ఛలో హైదరాబాద్ పేరుతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్నినిర్వహించారు. సాయంత్రం పోలీస్ అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.