అమెరికాలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు స్టూడెంట్ కి గాయాలయ్యాయి. ఆ కాల్పుల్లో తెలంగాణ విద్యార్థికి గాయాలు కావడంతో.. అతను చికాగోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికాగోలో చైనా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న బృందంపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన విద్యార్థి సాయి చరణ్ కి గాయాలయ్యాయి. సాయి చరణ్ స్నేహితులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. చైనా నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అమెరికాలోని చికాగోలో ఓ దుండగుడు మెషీన్ గన్ తో జరిపిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలోనే తెలంగాణకు చెందిన విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంటేరీ పార్క్ లో చోటుచేసుకుంది.
అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10.22 గంటల సమయంలో.. చైనా లూనార్ కొత్త సంవత్సరం సందర్భంగా వేల మంది వేడుకలు జరుపుకొంటుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్ వాన్ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. క్షతగాత్రులైన మరో 10 మందిని ఆస్పత్రికి తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగుడు స్థానికంగా ఉన్న డ్యాన్సింగ్ క్లబ్ ను టార్గెట్ గా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి మెషీన్ గన్ తో మాంటెరీ పార్క్ కు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.