టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. ఇటీవల రేవంత్ తెలుగుదేశం పార్టీ తనకు తల్లిపార్టీ లాంటిదని అభివర్ణించడంపై కాసాని రియాక్ట్ అయ్యారు. శనివారం కాసాని మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ టీడీపీని తన మాతృపార్టీగా అభివర్ణించడం సంతోషకరమని అన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలోకి రావొచ్చు కదా అని ఆహ్వానించారు. ఒకవేళ ఆయన టీడీపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు కాసాని.
ఆదివారం నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్చి 29న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతారని అన్నారు.
10 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీ పూర్వ వైభవం కోసం సూచనలు కూడా స్వీకరిస్తామని పేర్కొన్నారు కాసాని జ్ఞానేశ్వర్.