నోటిఫికేషన్ల జాడ లేదు.. భృతి ఇస్తామని ఇవ్వలేదు.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన.. ఓవైపు తల్లిదండ్రులకు భారం అవుతున్నామన్న బాధ.. అయోమయంలో భవిష్యత్.. చివరకు ఆత్మహత్యే శరణ్యం అని భావిస్తున్నారు నిరుద్యోగులు. గత జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు సూసైడ్ చేసుకున్నారు. ఇంకా.. ఎన్నాళ్లీ ఆత్మహత్యలు..? ఇదే నినాదంతో కలిసి పోరాడదాం.. ఉద్యోగాలు సాధించుకుందాం..? అంటూ ఉద్యమ కార్యాచరణను సిద్ధం అవుతున్నారు.
ఎలక్షన్ వచ్చిన ప్రతీసారి కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది ఒక్కటే. 50వేల ఉద్యోగాలు. ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ.. నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో విసిగిపోయిన నిరుద్యోగులు ఇప్పుడప్పుడే కొలువులు ప్రకటించరని భావించారు. కేసీఆర్ సర్కార్ పై పోరుకు సిద్ధమౌతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏకం అవుతున్న నిరుద్యోగులు.. తమ సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి, నాయలకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ డబ్బులు వస్తే.. ఆర్థికంగా కొంతైనా ఉపశమనం ఉంటుందని భావించింది యువత. కానీ.. మూడేళ్లు గడుస్తున్నా దాని ఊసే లేదు. నోటిఫికేషన్ల జాడే లేదు. దీంతో రగిలిపోతున్న నిరుద్యోగులు ఏకతాటిపైకి వచ్చి.. ఆలస్యమవుతోంది-మనకోసం మనమే పోరాడాలి అంటూ నినదిస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగి బచావో పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.
పార్టీలకతీతంగా గ్రాడ్యుయేట్లు అందరూ ఐక్యంగా ముందుకువెళ్తున్నారు. కొద్ది రోజుల్లోనే లక్షల మందితో భారీఎత్తున ఉద్యమించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలు కూడా కలిస్తే.. నోటిఫికేషన్లు త్వరగా వస్తాయని భావిస్తున్నారు నిరుద్యోగులు.