నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ త్వరలో ప్రకటన చేస్తారని కేటీఆర్ ప్రకటించారు. జమిలీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పాటు సెమీ ఫైనల్ వంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పోరేషన్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల నాటి హామీపై కేసీఆర్ దృష్టిపెట్టారు.
3016రూపాయలు భృతి ఇచ్చే అవకాశం ఉండగా, విధివిధానాలను ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న వాటిని బట్టి ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో భృతి ఇస్తుండగా… తెలంగాణలోనూ డిగ్రీ పూర్తి చేసి, 40ఏళ్ల వయస్సు మించని వారికి భృతి అందే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానాలో భృతి అమల్లో ఉండగా… ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిరుద్యోగ యువత అర్హతకు చదువును ఎంచుకున్నారు. ఆదాయ పరిమితిని ఎలాగైతే ఆసరా పెన్షన్లకు ఉంటుందో అలాగే ఉండేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అయితే, ఈ అంశాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని… బడ్జెట్ లో నిధులు కేటాయించేలా సీఎం కేసీఆర్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. టి.ఎస్.పీ.ఎస్.సీ వద్ద ఇప్పటికే డిగ్రీ సహా ఆపై చదువులు చదువుకున్న వారి డేటా ఉంది. ఇటు పీఎఫ్ కార్యాలయంలో ఇతర ఉద్యోగాలు చేస్తున్న డేటా ఉంటుంది. ఈ రెండింటిని క్రోడీకరించిన తర్వాత ఈ భృతిని అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది.