కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మరో లేఖ రాశారు మంత్రి కేటీఆర్. దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. ఇందుకు భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉందన్నారు కేటీఆర్. 2030 నాటికి అది 40 శాతానికి చేరవచ్చని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం కూడా ఉందని వివరించారు. పట్టణాలకు ప్రజలు వలసలు వస్తున్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
పట్టణ పేదలకు అవసరమైన హౌసింగ్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత వంటి అంశాలపైన ప్రత్యేక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చెప్పారు కేటీఆర్. వీటన్నింటికీ సరిగ్గా సమకూర్చగలిగితేనే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
కరోనా కారణంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్న కేటీఆర్.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొందని లేఖలో వివరించారు. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండాలన్నారు. ఒక్కరోజు ఉపాధి లభించకపోతే పేదల జీవన స్థితిగతులు తారుమారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో ఏదైనా కార్యక్రమాన్ని తీసుకొస్తే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు కేటీఆర్. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితుల్లో దేశంలోని ఎక్కడివారైనా ఏ పట్టణంలోనైనా లబ్ది పొందేలా ఇది ఉండేలా చూడాలని కోరారు.