మావోయిస్ట్ మహిళా నేత ఆలూరి ఉషారాణి డీజీపీ ఎదుట లొంగిపోయారు. తెనాలికి చెందిన ఉషా రాణి ప్రస్తుతం దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె 31ఏండ్లు మావోయిస్టుగా పనిచేసినట్లు డీజీపీ వెల్లడించారు.
1985లో ఉషారాణి తండ్రి భుజంగరావు పీపుల్స్ వార్లో చేరారని తెలిపారు. 1995లో ఆయన దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్గా పని చేశారని చెప్పారు. ఉషారాణి తల్లి, బావలు కూడా పీపుల్స్ వార్లో పనిచేశారని డీజీపీ పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు మావోయిస్టు దళాల్లో ఉండటంతో ఆమె కూడా అదే బాట పట్టినట్టు డీజీపీ చెప్పారు.
1991లో ఆమె మునుగోడు దళం సభ్యురాలిగా ఎన్నికైందన్నారు. 1998లో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలు తీసుకుని వెళ్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరగ్గా ఆమె భర్త మరణించారని డీజీపీ అన్నారు.
2002 నుంచి ఆమె ఇప్పటివరకు దండకారణ్య జోనల్ కమిటీలో సభ్యురాలిగా పనిచేసిందన్నారు. 2011లో ప్రాపగాండా ఆర్గనైజ్ చేయడానికి పొలిటికల్ టీచర్ ఇన్ మొబైల్ స్కూల్కి ఇంచార్జ్గా ఆమె పనిచేశారన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీని వీడితానని మావో నేతలను కోరిందని, రెండున్నరేండ్ల తర్వాత లొంగిపోయారని చెప్పారు.
జంపన్న, సుధాకర్ లు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన వారికి సరైన ఐడియాలజీ లేదన్నారు. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు.