కరోనా వైరస్ భయం పట్టణాలనే కాదు గ్రామాల్లోనూ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా గ్రామస్తులంతా ఇతరులను ఎవర్నీ తమ ఊర్లకు రాకుండా అడ్డుకుంటున్నారు.
అయితే, తల్లి శవంతో దహన సంస్కారాలకు మహారాష్ట్ర నుండి వస్తే… గ్రామస్తులు అడ్డుతగిలిన ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలో నివాసం ఉండే సింగరేణి ఉద్యోగి అయిన రాజయ్య మహరాష్ట్రలోని చంద్రాపూర్ లో ఉంటాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా మరణించటంతో సొంతూరులో అంత్యక్రియల నిమిత్తం తీసుకువచ్చారు.
కానీ మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో… గ్రామంలోకి రానివ్వమంటూ గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తన తల్లి పక్షవాతం వచ్చి చనిపోయిందన్న దృవీకరణ పత్రం చూపించినా వారు కనికరించకపోవటంతో… తన సొంత భూమిలో అంత్యక్రియలు చేసుకొని వెళ్లిపోతామని కోరటంతో ఒప్పుకున్నారు.