సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలనేది బీజేపీ డిమాండ్. ఎంఐఎంకు భయపడి టీఆర్ఎస్ సర్కార్ దీన్ని నిర్వహించడం లేదనేది ఏడేళ్లుగా చేస్తున్న ఆరోపణ. దీనికి నిరసనగా నిర్మల్ లో అమిత్ షా చీఫ్ గెస్ట్ గా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్
‘‘సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’’.
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి ఇష్టం పడడం లేదు. ఇంకోవైపు గవర్నర్ ప్రజలకు శుభాకంక్షలు తెలిపారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి పొందిన సెప్టెంబర్ 17ని విమోచన దినంగా అధికారికంగా జరపాలని వాడవాడలా బీజేపీ జాతీయ జెండాలు ఎగురవేస్తోంది. ప్రతీ ఏటా ఆందోళనలు నిర్వహిస్తోంది. అయితే బీజేపీది మత రాజకీయం అంటూ టీఆర్ఎస్ విమర్శలు చేస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
నిజానికి ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవానికి జై కొట్టారు. కానీ.. అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకున్నారు. ఎంఐఎంకు భయపడే కేసీఆర్ ఈ విషయంలో వెనక్కి తగ్గారని ఆరోపణలు చేస్తోంది బీజేపీ. మైనార్టీలను సంతృప్తి పరచడానికి, మజ్లీస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తున్నారని మండిపడుతోంది.