తెలంగాణలో ఎండలు ఇప్పటికే దంచికొడుతున్నాయి ఏప్రిల్ కూడా రాలేదు. అప్పుడే ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణశాఖ చల్లటి కబురు తెచ్చింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు కూడిన తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలు పడే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో నిన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో అత్యధికంగా 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.