తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఉత్తర,తూర్పు తెలంగాణ జిల్లాల్లో మరో రెండు రోజులు పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని వివరించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలకు వారం రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజస్థాన్, గుజరాత్ (సౌరాష్ట్ర మరియు కచ్), ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక (దక్షిణ ఇంటీరియర్), తమిళనాడు, పుదుచ్చేరిలోని ఏకాంత ప్రదేశాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (విదర్భ, మధ్య), అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్ ప్రాంతం, గోవా, కొంకణ్, కర్ణాటక (ఉత్తర అంతర్గత ప్రాంతాలు, తీరప్రాంతం) సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మోస్తారు నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.