తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బండి సంజయ్ తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. కాగా, ఎమ్మెల్సీ కవిత మద్యం వ్యాపారం చేసి సిగ్గు లేకుండా స్కామ్ లో ఇరుక్కుందని.. తప్పు చేసిన వారిని విచారించకుండా ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.
బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఇక ఈ వ్యాఖ్యలపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు మంత్రి సత్యవతి. తెలంగాణ గడ్డపై పుట్టినవారు కేసులకు భయపడరన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేశారు.. బీజేపీ మెడలు వంచే రోజులు దగ్గరరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహిళా లోకం తిరగబడితే బండి సంజయ్ అధోగతే అంటూ ఫైర్ అయ్యారు సత్యవతి.