మీ కలాలు గులాములైనయా...? - Tolivelugu

మీ కలాలు గులాములైనయా…?

akhilesh

అఖిలేష్ కాసాని, తెలంగాణ సోషల్ ఆక్టివిస్ట్

ప్రజాకవులారా.. మీది ప్రజా క్షేత్రమా.. పాలకుల పక్షమా తేలిపోవాలి.. రాజకీయ కలుగులకెల్లి బయటికి రావాలి..

తెలంగాణ లో పాటకి చాలా ప్రత్యేకత ఉన్నట్టే ప్రజా కవులకి ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళు రాసే పాటల్లో ప్రజాసమస్యలు,మానవ హక్కులు,మానవ సంబంధాలే గాకుండా పల్లె జీవం ఉంది.అందుకే మనం కనెక్ట్ అయినంత తొందరగా పాటకి ఎవ్వరు గారు.అది ప్రజాకవుల గొప్పతనం. అలాంటి ప్రజాకవులు తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేశారు. ఈ క్రమంలో గత కొన్ని ఏండ్లు గా తెలంగాణ ఉద్యమము చుట్టే పాట గట్టారు.రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ప్రజాసమస్యలు, సామాజిక ఉద్యమాలు,చైతన్యపరచాల్సిన అంశాలు,వాటి మీద ప్రజా కవులు రాయలసిన రచనలు ఆగిపోయయి అనిపిస్తుంది.

ఒకప్పుడు చెత్తకుండి,చీపురు కట్ట, ఫ్యాన్ పంక మీద, అమెరికొని బిస్కెట్ మీద పాట గట్టినోళ్ళకు బంగారు తెలంగాణలో మల్లన్న సాగర్,గోలివాడ రైతులపై లాఠీచార్జి,కొండగట్టు బాధితులు, ఇంటర్ పిల్లల మరణాలు, ఆర్టీసి సమ్మెలు, నిరుద్యోగుల తిప్పలు, సామాన్యుల గోసలు కనపడుతలెవ్వు.. పెన్ను ఎందుకు కదులుతలేదు.సామాజిక స్పృహ కలిగిన పెద్దన్నలు చెద్దరి గప్పుకొని నిద్రపోతే ఎట్లా ?

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అంటూ, పల్లె అందాలని పొగుడుతూ, ప్రపంచికరణను ఎండగడితే పాలకులు, ప్రతిపక్షంలో పడి, ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు అయిండ్లు. నాడు ‘రాజ్యహింస జరుగుతుందో, పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతుందో ‘ అంటూ రాజుని రాజ్యాన్ని ప్రశ్నించిన గొంతు, తెలంగాణ రాక తో ‘ఎద పైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో, ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగెనో ‘ అని కలలు గన్న మన పాటల గుట్ట నేడు గిట్టుబాటు ధర లేక రైతులు ఉరికొయ్యలకు ఉరితాళ్ళు పెనుతుంటే హలానికి అండగా ఉండవలసిన కలము కండ్లు ప్రభుత్వము ఇచ్చిన కాళోజి శాలువా కమ్మేసిందా ? ఎందుకు రైతు దుఃఖాన్ని ఎత్తుకుంటలేదు మీ కంఠం.?

‘మత్తడి దునికి అలుగు తన్నుకొని పారినట్టు ‘ పాడిన గొంతుకలు రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మత్తడి ఎందుకు మూగపోయింది? అమరత్వం కోసం రాసిన ‘మిత్రుడు’ కనుమరుగు ఎందుకు అయ్యిండు?

‘నీవు గన్ను పడితే ఉడుము నీకు అండగా ఉంటది, నీవు కన్ను మూస్తే ఆకాశానికి చిల్లు పడుతాది ‘అంటూ సింగరేణి శ్రామికుడి శ్రమ ని పొగిడిన ప్రకృతి ప్రేమికుడి తెలంగాణ పల్లె పాట ఏది?

‘మాయమై పోతున్నాడు అమ్మ మనిషి అన్నవాడు’ అని మానవాసంబంధాలు కొత్త కోణంలో చూపించిన అందెవేసిన చెయ్యి, దక్కని గౌరవం కోసం అన్నా ఎక్కలిసిన జనం గుండె మెట్లు ఎందుకు దిగుతుండు. ‘కొట్టార కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా’ అని ఉద్యమాన్ని ఉరకలు ఎత్తించిన గొంతు సినిమ మత్తులో, సబ్బండ జాతులని వదిలి వ్యక్తిపూజకె ఎందుకు పరిమితం అయింది. నాడు మాటలు రాని తాటిచెట్టు ని పల్లకి లో ఉరేగించినోళ్లు మూగబోయిన శృతి, సాగర్లా పాడే ఎందుకు మోయలేదు? కారకులను కడిగి ఎందుకు పారేయ్యలేదు??

“పొద్దంత రందాయెరో రైతన్న బతుకంత బాధాయెరో రైతన్న..” అని రైతుల తిప్పలను కండ్లకు కట్టినట్టు రాశి సూపిచ్చిన కలాలన్ని కాళేశ్వరం యాత్రకు పోతున్నయి గాని నిర్వాసితుల కన్నీళ్ళను తుడువలేకపోతున్నయి.. సర్కారు దగ్గర కలాలన్ని గులాములయినయా ఏంది..?

నా పోస్ట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రజలకు మెగా స్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ అన్నీ మీరే.. ప్రజల వైపు ఉండవలసిన మీరు పాలకుల చెర లో బందీలు అయి అగ్గి లాంటి మీ ఆశయాలను ఆవిరి చేసి ప్రజలకోసం రాయవలసిన పాటకు పాడే కట్టోద్దు అని మనవి. ఇంత రాసిన నేను మీ ఒక్కరోజు ఆకలి తీర్చలేను కానీ నా పిల్లలకు “ప్రజాకవి” అని పరిచయం అయితే తప్పక చేస్తా…

వర్ధంతి సంధర్భంగా కాళన్న యాదిలో..

Share on facebook
Share on twitter
Share on whatsapp