సాధారణంగా ఒక సామాన్యుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా కలవాలంటే ఏం చేయాలి? అంటే బహుశా ఎవరి దగ్గరా ఇందుకు సమాధానం ఉండదు. తెలంగాణలో అయితే ప్రస్తుతం అది అసాధ్యం కూడా. ఎందుకంటే సొంత పార్టీ నేతలకే ముఖ్యమంత్రి కేసీఆర్.. అపాయింట్‌మెంట్ దొరకదు. ఇక సాధారణ ప్రజల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించి, అవకాశం దక్కకపోవడంతో తెలంగాణ యువసేన పార్టీ నేత ఆడపా సురేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని.. ఏకంగా పత్రికా ప్రకటన ఇచ్చారు.అత్యవసరంగా ఓ ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాల్సి ఉందని… వ్యక్తిగతంగా తనకు కలిసేందుకు చాన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పత్రికాముఖంగా కోరారు సురేందర్. తన విజ్ఞప్తిని పరిశీలించి అవకాశం ఇస్తారని అనుకుంటున్నట్టు అందులో విజ్ఞప్తి చేశారు. ప్రకటనలోనే తన ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి వివరాలన్నింటిని కూడా పంచుకున్నారు.
సురేందర్ ఇచ్చిన ఈ పత్రికా ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకి సురేందర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంత ముఖ్యమైన విషయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.