అంతర్గత కుమ్ములాటలతో సతమతవున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయడానికి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ నూతన ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రేను ఎయిర్ పోర్టులోని లాంచ్ లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఆహ్వానించారు.
తరువాత గాంధీ భవన్ లో లాల్ బహదూర్ శాస్త్రీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు చేసి నివాళులర్పించారు. థాక్రే తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఉదయం 10.30 నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షులు,సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగత భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశం ఉంటుంది. రేపు డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య నెలకొన్న టగ్ ఆఫ్ వార్ ను ఆయన ఎలా పరిష్కరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రాజీనామా లేఖలతో నివ్వెరపోయిన సీనియర్లను ఎలా బుజ్జగిస్తారో చూడాలి. మాణిక్కం ఠాకూర్ తో అవలీలగా సమస్యను పరిష్కరించగలన్న నమ్మకంతో పార్టీ నాయకత్వం ఆయనను పంపింది. కాగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావ్ థాక్రే ఫోన్ చేశారు. గాంధీ భవన్ కు ఠాక్రే ఆహ్వానించారు. అయితే బయటే కలుస్తా అని కోమటి రెడ్డి తెలపడంతో.. కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
అయితే కోమటిరెడ్డితో థాక్రే కలుస్తారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ కలిస్తే ఏం మాట్లాడుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రేవంత్ పై విమర్శలు గుప్పిస్తారా.. అనే దానిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు మాట్లాడుతూ.. ఠాగూర్ తో సమస్యలు ఏమీ లేవన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అన్నారు.కొత్త ఇంచార్జ్ అన్నీ సర్దుకుపోతాయని భరోసా ఇచ్చారు. 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 77 సీట్ల లో కాంగ్రెస్ గెలవబోతుందని అన్నారు. అందరిని కలుపుకుని పోయేలా కొత్త ఇంచార్జ్ పని చేస్తారని స్పస్టం చేశారు.