ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. నేతల మాటల యుద్ధం తర్వాత ఇష్యూ కోర్టు పరిధికి చేరింది. అయితే, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇప్పటికే సీఎం కేసీఆర్, జగన్ లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఫోన్ లోనూ మాట్లాడారు.
అయితే, ఈనెల 26న ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి ఆద్వర్యంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీ కోసం సీఎం కేసీఆర్ ఈనెల 24నే ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. 25వ తేదీన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశం అవుతారని తెలంగాణ సీఎంవో వర్గాలు అధికారికంగా కూడా ప్రకటించాయి.
26న జరిగే మీటింగ్ కు ఏపీ సీఎం జగన్ కూడా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఈనెల 25న జగన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్రమంత్రి ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి… సామారస్యంగా వివాదాలు పరిష్కరించేందుకు కృషి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.