తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) ఎలక్షన్స్ ముగిశాయి. నిర్మాత మండలి ఎన్నికలు ప్రతీ రెండేళ్ళకి ఓ సారి జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ ఎన్నికలను ప్రకటించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి.
ఇందులో మొత్తం 1134 మంది ఉండగా.. 678 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అధ్యక్ష పదవి కోసం దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ పోటి పడ్డారు. నిర్మాత దిల్ రాజు.. దామోదర ప్రసాద్ కు, సీ కళ్యాణ్.. జెమిని కిరణ్ కు మద్దతు తెలిపారు.
కాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా దామోదర ప్రసాద్ గెలుపొందారు. ఈ పోరులో జెమిని కిరణ్ కు 315 ఓట్లు పడగా.. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు పడ్డాయి. జెమిని కిరణ్ పై దామోదర ప్రసాద్ 24 ఓట్ల తేడాతో గెలిచారు.
ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో దిల్ రాజు , సీ కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు, సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినీదత్ తదితరులు ఉన్నారు.