దేశంలో కరోనా వైరస్ కట్టడిపై ప్రధాని మోడీ పది రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో పది రాష్ట్రాల నుండే అత్యధిక కేసులు వస్తున్నాయన్న మోడీ, కరోనాపై యుద్ధంలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. ఈ పది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సీఎంలు జగన్, కేసీఆర్ లు… ఏపీ, తెలంగాణలో ఉన్న పరిస్థితులను వివరించారు. తెలంగాణలో మరణాల రేటు ఒక్క శాతంలోపే ఉందని, రికరవరీ రేటు 71శాతం ఉందని కేసీఆర్ అన్నారు. ఐసీఎంఆర్, కేంద్ర కమిటీల సలహాలను పాటిస్తూ విజయవంతంగా కరోనా కట్టడికి కృషి చేస్తున్నామన్నారు. అయితే కరోనా వైరస్ వంటివి భవిష్యత్ లోనూ వచ్చే అవకాశం ఉన్నందున, ఇక నుండి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వైద్యశాఖలో సమూల మార్పులు తీసుకరావాలని, జనాభా నిష్పత్తిని బట్టి ఎన్ని మెడికల్ కాలేజీలుండాలి, ఎంత మంది వైద్యులుండాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పులపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో విజృంభిస్తున్న కేసుల గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ కేసులు దేశంలో వచ్చిన నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదని, అలాంటిది రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. 25కేసులున్న ప్రాంతాన్ని క్లస్టర్ గా గుర్తిస్తున్నామని, ఆయా క్లస్టర్స్ లోనే 95శాతం టెస్టులు చేస్తున్నట్లు ప్రధాని దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో మెట్రో నగరాలు లేవని… ద్వితీయ శ్రేణి నగరాల్లో వైద్య సదుపాయాల కోసం కేంద్రం సహాయం చేయాలని కోరారు.