కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య తగవులాట విచిత్రంగా మారింది. తమలపాకుతో నువ్వొక్కటి అంటే.. తలుపుచెక్కతో నేనొకటి అంటానన్నట్టుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పరస్పర ఫిర్యాదులతో సమస్యను అలా… సాగదీస్తున్నాయి. తాజాగా మరోసారి రెండు రాష్ట్రాల నీటి వివాదం కేంద్రం వద్దకు చేరింది. శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కృష్ణా బోర్డు సభ్యుడు ఎల్.బి ముంతాంగ్ కేంద్ర జలశక్తి శాఖకు ఓ లేఖ రాశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులోనూ ఓ పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో.. తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాలకు సాగునీటి సమస్య తలెత్తుతుందంటూ లేఖ రాసింది.
మరి ఏపీ సర్కార్ ఊరుకుంటుందా.. వెంటనే రంగంలోకి దిగింది. శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం.. జల విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరింది. జలవిద్యుత్ ఉత్పత్తి కారణంగా రాయలసీమ, చెన్నై వంటి ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయాన్ని నిన్న కృష్ణా బోర్డు.. కేంద్రం చెవిన వేసింది. శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని బోర్డు కోరింది.
వాస్తవానికి కృష్ణా జలాల వివాదంపై ఇటీవల స్వయంగా కేంద్రమే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుపుతామని ఏపీ, తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించింది. కానీ తమకు చాలా పనులున్నాయని.. తెలంగాణ సర్కార్ ఆ భేటీని వాయిదా వేయించింది. ఏపీ సైలెంట్‌గా ఉండిపోయింది. అసలు ఆ రోజే ఈ మీటింగ్ నిర్వహించి ఉంటే కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యేవంటున్నారు నిపుణులు.