కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ భేటీ అయింది. ఈ త్రిసభ్య సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడాలు, నీటి పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ తో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి భేటీ అయ్యారు. 2021-22 సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న జలాల వివరాలను పరిశీలించి.. నీటి వాటాలను తేల్చేయనుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కృష్ణా, గోదావరి జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కృష్ణానది జల వివాదాలు ఇప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.