వలస కూలీలు అయ్యో నడిచిపోతున్నారే…. అయ్యో పాపం చిన్నారులతో వెళ్తున్నారా… నా మనసును కలిచివేసింది, మన ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న మాటలు ఈ మధ్య తరచూ వినపడుతూనే ఉన్నాయి. కానీ ఈ సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకొని తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి.
కరోనా అనేది కష్టకాలం. కానీ ఈ కష్టకాలంలో సహయం చేసేది చిన్నదే అయినా ప్రచారం మాత్రం పెద్దగా కోరుకుంటున్నారు. అందుకు అధికార పార్టీలు కూడా మినహాయింపు కాదు అనటానికి ఈ ఫోటో మంచి ఉదాహరణ.
వలస కూలీలకు సహయం చేశాం. కడుపు నిండా అన్నం పెట్టాం. అలా కడుపునింపుకున్న ఓ చిన్నారి ఆనందం చూడండి అనే అర్థం వచ్చేలా మేమే చేశాం అని టీఆర్ఎస్ అనుకూల పేజీలు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడేలా మేమే చేశాం అని వైసీపీ అనుకూల పేజీల్లో ప్రచారం సాగుతోంది.
ప్రభుత్వాలుగా సహయం చేయటం మీ బాధ్యత. అంతేకానీ మీరేదో గొప్పలు చేశామని… 50 రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా ఇంటికి చేర్చని అధికార వర్గాల అసమర్ధతను ఎత్తి చూపుతున్నాయి అవే చిరునవ్వులు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
పోనీ ఎదైనా ప్రభుత్వమే కదా సహయం చేసింది అనుకుందాం అంటే అదీ లేదు. నిజానికి ఆ వలస కూలీలకు, ఆ కడుపు మాడి ఏడ్చిన ఆ చిన్నారి చిరు నవ్వుకు కారణం చైతన్య సహా పలువరు వాలెంటీర్లు. మేడ్చల్ ఓఆర్ఆర్ సమీపంలో వాళ్లకు తినేందుకు అన్నం పెట్టింది వారే. కానీ ప్రభుత్వాలు మాత్రం మేం చేశాం అంటే మేం చేశాం అని గొప్పలు చెప్పుకోబోయి… అడ్డంగా బుక్కయ్యారు.
ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలకు ప్రచారం ఉండాలి కానీ తాము చేయని మంచిని కూడా పోటీ పడి మరీ తామే చేశాం అని చెప్పుకోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.