శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది. బియ్యం, పప్పులు, చికెన్, పళ్లు ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో తినడానికి తిండి లేదు. జీవనాధారం గల్లంతైంది. లంక ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు. దీంతో శ్రీలంక భారత్ సాయాన్ని అడుగుతోంది. ఇప్పటికే దాదాపుగా 40 వేల టన్నుల డిజిల్‌ను ఇటీవల సరఫరా చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆకలితో అలమటిస్తోన వారిని ఆదుకునేందుకు భారత్ మరోసారి ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీలంక ప్రజలకు బియ్యం పంపించనుంది.
శ్రీలంక అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఇండియా.. తక్షణ సాయం కింద బియ్యం పంపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్ తదితర పోర్టుల నుంచి బియ్యం శ్రీలంకకు ఎగుమతి చేయనున్నారు. మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దశలవారీగా శ్రీలంకకు పంపుతామని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు తెలిపారు.
కాగా, మొదటగా కాకినాడ పోర్టు నుంచి బుధవారం 2 వేల మెట్రిక్ టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. ఇక తెలంగాణలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో 26 మంది కేబినెట్ మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంక ప్రధానికి రాజీనామా పత్రాలు అందజేశారు. రాజీనామాల నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వారు పేర్కొన్నారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ధరల పెరుగుదల, నిత్యవసరాల కొరత, విద్యుత్ సంక్షోభం కారణంగా నేపథ్యంలో ప్రజలు నిరసన బాట పట్టారు. అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ.. అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. దీంతో తీవ్ర హింస చెలరేగింది. పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మంగళవారం రాత్రి ప్రకటించారు.