జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో 100 శాతం మార్కులతో మహారాష్ట్ర కుర్రాడు సత్తా చాటాడు. ఈ ఫలితాల్లో ధ్యానేశ్ హేమేంద్ర షిండే 100 ఎన్టీఏ మార్కులు సాధించాడు. ఆయనతో పాటు మరో 20 మందికి కూడా 100శాతం ఎన్టీఏ మార్కులు వచ్చాయి.
కోచింగ్ సమయంలో ఐదేండ్ల పాటు ఫోనుకు దూరంగా ఉన్నానని అందుకే ఈ విజయాన్ని అందుకోగలిగానని ధ్యానేశ్ చెప్పాడు. ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాల్లో ధ్యానేశ్ కు 100 శాతం మార్కులు రావడంతో ధ్యానేశ్ కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
మరోవైపు జేఈఈ-2023 మెయిన్ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఎన్‌టీఏ విడుదల చేసిన పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో టాప్ -20 విద్యార్థుల జాబితాలో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేశ్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, అభినీత్ మాజేటిలు 100 శాతం ఎన్టీఏ మార్కులతో సత్తాచాటారు. జేఈఈ తొలివిడత పరీక్షలను
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో నిర్వహించారు.
జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 6 నుంచి 12వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది.