భానుడు ఉదయం నుంచే ఉగ్రరూపం దాల్చి నిప్పులు చెరుగుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓవైపు ఉక్కపోత, వేడిమి తీవ్రంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది తర్వాత బయటకి రావాలంటే జంకుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవి. మరో పది జిల్లాల్లో 44.8 నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శుక్ర వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని సూచించింది. ఒకవేళ పనిపై బయటికి వచ్చినా పల్చటి దుస్తులు, ఎండ నుంచి బయటపడేందుకు గొడుగు వినియోగించాలని పేర్కొంది. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు శీతలపానీయాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఇక, హైదరాబాద్‌లో బుధవారం రోజున ఉష్ణోగ్రత 36 డిగ్రీలు దాటేసింది. ఎండలు మండిపోతుండటం వల్ల ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపై రద్దీ తగ్గింది. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు ఎండ తాకిడికి బెంబేలెత్తిపోతున్నారు. గొడుగుల నీడన విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో ఇంకెలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు.