రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి కాలం మొదట్లోనే ఎండలు మండిపోతే.. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
రాష్ట్రంలో భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రజలు పగలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎర్రటి ఎండలో రెండు నిమిషాలు ఉండలేకపోతున్నారు. మార్చిలోనే మే నెలను తలపిస్తున్న ఎండలను చూసి ఆందోళన చెందుతున్నారు.
ఆదివారం పగలు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. దీంతో అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది.
అంతేకాకుండా.. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు రాత్రిపూట సైతం 25 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కపోత, వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.