మహాదివ్య క్షేత్రంగా పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్చి 28 న మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా.. పనుల్లో వేగం పెరిగింది. ఆలయ గోపురాలు, దివ్య విమానంపై స్వర్ణ కలశాల ఏర్పాట్లకు యాడా చర్యలు చేపట్టింది.
ఎత్తైన ఆరు రాజగోపురాల పైన, దివ్య విమానంపై శ్రీ సుదర్శన చక్రం ప్రతిష్ఠించనున్నారు. అయితే.. ప్రస్తుతం గోపురాలపై కలశాల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన అనంతరం కలశాల స్థాపన జరగనుంది.
యాదాద్రి క్షేత్రంలో పచ్చదనం, ఆహ్లాదం కోసం హరితహారాల పోషణ జరుగుతోంది. ఆలయ దారుల మధ్య రంగురంగుల పూల మొక్కలు, వైకుంఠ ద్వారం వద్ద పూల సోయగాలు కనువిందు చేస్తున్నాయి.
కొండపైకి వెళ్లే మార్గంలో ఖాళీ స్థలాలు కనిపించకుండా గ్రీనరీ, పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలని గ్లీనరీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయాధికారులు వెల్లడించారు. అందుకు అనుగుణంగా క్షేత్రంలో పచ్చదనం, ఆహ్లాదం కోసం రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు.