దీపావళి పండుగ వచ్చేస్తుంది. దీపావళి పండుగతో ఇంటిలో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇళ్లులు, వీధులు దీపాలతో మెరిసిపోతాయి. అసలు దీపావళి అంటేనే టపాసుల మోత. చిన్నా పెద్ద తేడా లేకుండా ఇంటిల్లి పాదీ ఆనందంగా గడుపుతారు. దీపావళి అంటే పిల్లలందరూ కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకునే పండుగ. అయితే ఈ సారి టపాసుల దుకాణాలకు కొత్త రూల్స్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
దీపావళి సందర్భంగా తాత్కాలిక టపాసుల షాపులు ఏర్పాటు చేసే వారికి.. లైసెన్స్ జారీ చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. దరఖాస్తు దారులు www.tspolice.gov.in (or) esevices.tspolice.gov.in ద్వారా ఈ నెల 18వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
అలాగే ఈ దరఖాస్తుకు సంబంధించి కావాల్సిన ఆధారాలను కూడా తెలియజేశారు. దరఖాస్తు ఫారంతో పాటు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ జారీ చేసిన ఎన్వోసీ, ప్రభుత్వ స్థలమైతే సంబంధిత అధికారులు ఇచ్చిన అనుమతి పత్రం, గతేడాది జారీ చేసిన పాత లైసెన్స్ కాపీ, భవనాల్లో ఏర్పాటు చేస్తే ఇరుగు పొరుగు వారి నుంచి ఎన్వోసీ, వీటితో పాటు మేడ్చల్ జిల్లాలోని కీసర ఎస్బీఐలో లైసెన్స్ ఫీజు రూ.600 పోలీస్ శాఖ అకౌంట్ లో చెల్లించాలని సూచించారు.
కాగా దీపావళి పండుగ కారణంగా వాతావరణం కాలుష్యం అవుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టపాసులు కాల్చవద్దని చెబుతూనే ఉన్నాయి. అయితే కరోనా నుంచి దీపావళి పండుగ కాస్త కళ తప్పిందనే చెప్పవచ్చు.