ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడా వడగాలులు మొదలవ్వగా, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. త్వరలోనే 40 డిగ్రీల వరకు చేరుతుందని వాతావరణశాఖ భావిస్తోంది. ఇటు విశాఖపట్నం జిల్లాలో కూడా ఎండలు మండుతున్నాయి. 36, 38 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటోంది.
ఏపీ అంతటా కనిష్టంగా 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి ముందుగానే వేడిగాలులు మొదలైన నేపథ్యంలో… వారంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయంటున్నారు.
పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు పైపైకి పోతుంటే…రాత్రి సమయంలో మాత్రం పడిపోతున్నాయి. రాత్రివేళల్లో చలిగాలుల ప్రభావం కొంత కనపడుతుంది. రాయలసీమలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. ఒడిశాలోని గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావడంతో అక్కడ ఎండల తీవ్రత పెరిగిందని, దీని కారణంగా ఉత్తరం నుంచి వేడిగాలులు ప్రభావంతోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.